Wednesday, March 9, 2011

అమ్మదొంగా...

మహిళా దినోత్సవం నాడు నాకు నా బుజ్జి తల్లి చూపించిన చిట్టి చిట్టి ఆప్యాయత, చాలా రోజుల తర్వాత ఒక పోస్ట్ తీరిక చేసుకొని అయినా రాయాలని గట్టిగా అనిపించేలా చేసింది.
నేనూ ఎంతో మంది అమ్మాయిల్లాగే ఎందుకో తెలియదు కానీ మొదటి సారి కడుపుతో ఉన్నప్పుడు అబ్బాయి కావాలనే కోరుకొన్నాను.  అమ్మాయి పుట్టిందని నిరాశ పడలేదు కానీ తర్వాత అయినా అబ్బాయి అయితే బాగుండని అనుకొన్న మాట నిజం. మా అమ్మ నా పక్కనే కూర్చొని నాకు మెళకువ రాగానే అమ్మాయే, భలే చక్కగా ఉన్నది అని చెప్పటం నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నది. రెండో సగం నేను అబ్బాయి కాదని నిరాశ పడకూడదని ప్రత్యేకంగా చెప్పిందని నాకు అర్దం అయింది. (నిజంగానే మా అమ్మాయి పండే అనుకోండి :))

కానీ 'దేవుడా నా క్షుద్రమైన కోరికలన్నీ కాదని నన్ను ఉద్దరించు' అని టాగూర్ కోరినట్లు, నా కోరిక కాదని అంత కంటే గొప్ప వరమైన ఆడపిల్లను నాకు ఇవ్వటం దేవుడు నాపై చూపిన కరుణ అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.  నా ముఖ కవళికలు తనకు ఎలా తెలుస్తాయో!, పట్టు మని పదేళ్ళైనా లేకుండానే అమ్మ లా అన్నీ అర్ధం చేసుకొంటుంది.  కాలేజి తర్వాత ఫ్రండ్సే లేరే అనుకొంటుండే దాన్ని. ఇప్పుడు ఎన్నో విషయాలు ఆరిందలా వింటూ, ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడు వస్తూ, పని చేసుకొంటుంటే పక్కనే ఉండి సుత్తి చెప్తూ నాకు మంచి స్నేహితురాలు నాకూతురు.  నేను ఎంతో ఇష్టంగా నేర్చుకొన్న ముగ్గులు, వంటలు, కుట్లు, పాటలు పద్యాలు నేర్చుకొనే నా ప్రియ శిష్యురాలు మా తల్లి.   ఇక పండగలొచ్చినా, ఫంక్షన్లు వచ్చినా తనచుట్టూనే మొత్తం కధ అంతా..

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ... కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ... ఈ పాటలో ప్రతి మాట ఎంత నిజం. అమ్మాయి కలిగి ఉండటం పెద్ద అదృష్టం.

ఎలా అయినా అమ్మాయిల్లేని తల్లులకు అమ్మాయిలున్న తల్లులకు తేడా ఉంటుందే అని మా పిన్ని అంటే ఏమో అనుకొన్నాను, నిజంగానే అమ్మాయి పెంపకంలో బాధ్యత, తనను ఒకరింటికి పంపటంతో ఎన్నో ఇష్టంగా భరించే కష్టాలు ఇవి అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి కొంత సున్నితత్వం, అర్ధం చేసుకొనే తత్వం వస్తాయేమో!


నా చిన్ని కిట్టుడు అల్లరి చెయ్యటానికే గానీ పెద్ద అవుతున్న కొద్దీ అమ్మకు దూరం అవుతున్నాడు. కారు బొమ్మలతో, బంతులతో ఆడటం మీది ఆసక్తి అమ్మ పక్కన కుదురుగా కూర్చోటంలో ఉండదు. ఆ అసలు కృష్ణుడు కూడా అంతేగా యశోదమ్మకు ముద్దు మురిపాలు మహా అయితే ఎనిమిదో ఏట దాకేగా.. తర్వాత గోపికలూ, రాధమ్మా, రాచరికాలు, రాయబారాలు..
అబ్బాయూ కావాలి, మన అమ్మాయి మరో ఇంటికి వెళ్ళి నప్పుడు మనకు తోడు ఉండటాని మరో అమ్మాయి ని తేవటానికైనా కావాలి. :)



4 comments:

  1. మైత్రేయి...నిజంగా చాలా బాగా రాసారు..
    నేనూ మీలాగే అబ్బాయి అయితే బాగుండును అనే అనుకున్నాను..అమ్మాయిగా మనం పడే బాధలు వాళ్లు తప్పించుకోవచ్చుకదా.అని అనుకునేదాన్ని. కానీ ముందు అమ్మాయే పుట్టింది. వెంటనే అబ్బాయి కూడా..దేవుడు నాకు రెండు కోరికలూ తీర్చాడు. కానీ అమ్మాయితో హాయిగా ఫ్రెండ్ లాగా ఉండవచ్చు.మనం జీవితంలో నేర్చుకున్న పాఠాలన్నీ తనకీ కామన్ సిలబస్సే కనుక వివరించి చెప్పొచ్చు.:))
    అబ్బాయిలకి పదేళ్ళవరకూ అమ్మల్లా పెంచినా తర్వాత టీచర్ లాగా రోజూ క్లాసులు పీకాల్సి(మన మాటలని వాళ్ళు అలాగే అంటారుగా)వస్తుంది.
    మనకి ఎప్పుడూ అమ్మాయే మంచి ఫ్రెండు అనుకుంటాను నేను

    ReplyDelete
  2. నిజమండి. ఇంకా పెద్ద అయ్యేకొద్దీ అమ్మాయిలపైన మానసికంగా ఆధారపడతామేమో అనిపిస్తుంది. తల్లులకే కాదు తండ్రులకు కూడా వరం ఆడపిల్ల జననం. కరువులోజుల్లో కట్నాల బాధలకో మరే బాధలకో అమ్మాయిలు వద్దనుకొనే వాళ్ళేమో కానీ ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు.
    అబ్బాయి ఉంటే ఐశ్వర్యం అమ్మాయి ఉంటే ఆనందం అనవచ్చేమో! మెదట అబ్బాయి అయితే ఇంక పిల్లలొద్దు అనుకొనే తల్లులూ, u r missing some thing.

    ReplyDelete
  3. When i was pregnant, i too think if i was blessed with a baby boy,stop with him.
    But my husband always prays to god,i need a baby girl.
    I am blessed with a baby girl finally.
    operation theatre lo doctor girl ani cheppagane abba ammaya anukonnanu.
    kani nenu tanani first time chusinapudu,she is just like me,xerox copy anna mata
    naku bale happy ga anipinchindi.
    ippud tanaki 7 months.
    nidra lechaka pakkana nenu kakunda evaryna vunte,calm ga adukontundi.
    oka vela nenu vunte,nannu lepi chusi navvutundi.
    daggariki vachi hug chesukontundi.
    maa husband antadu,nee kuturu ki nuvvantene istam ani.
    tanu ippudu naku chala precious.
    abbayi ayte antha enjoy chesedanni kademo.

    ReplyDelete
  4. చాలా బాగుందండి.

    ReplyDelete