Friday, February 3, 2012

శ్రీ రామ రాజ్యమా సీతా వనవాసమా?

బాపుగారికి గల రామభక్తి గురించి వినటం వల్ల చాలా ఆశలతో ఈ సినిమాకు వెళ్ళిన నాకు కొంచెం నిరాశే కలిగిందని చెప్పాలి. బాపుగారు మొదట నుండి స్త్రీ పక్షపాతే ననుకోండి ముత్యాలముగ్గు లో కానీ మిస్టర్ పెళ్ళాంలో కానీ సున్నితంగా మగవారిని విమర్శిచారు. బాపుగారి స్త్రీ పాత్రలు అభిమానవతులు, తెలివైన వారు, కష్టజీవులు ఎలాగైనా మగపాత్రలకంటే ఒక పిసరు ఎక్కువ గానే ఉంటాయి వాళ్ళ కారెక్టర్లు. కానీ ఇదే పంధా సీతా రాముల కధలో చూపించటమే నాకు కొంచెం నచ్చలేదు.

అది స్రిప్ట్ లో లోపమో నటనలో లోపమో రాములువారి గొప్పదనం మన మనసుకు అంటదు. మాటలు కూడా చాలా అసంతృప్తి కలిగించేట్లు ఉన్నాయి. ముఖ్యంగా సీతమ్మను వదిలివెయ్యాలని నిర్ణయించుకోవటంలో అనవసరంగా తమ్ముళ్ళని తూలనడటం, రాముణ్ణి శాంత గంభీర మూర్తి గా విన్న మనకు మ్రింగుడు పడదు. అలాగే రాములు వారు చేసింది తప్పన్నట్లు ప్రతివాళ్ళు మాట్లాడటం, భూదేవి తన కుమార్తె గురించి బాధపడినట్లు మాత్రమే లవకుశలో చూపిస్తే ఇక్కడ ఆవేశ పడి పోవటం, శాపాలు పెట్టటం కొంచెం చూడటానికి కష్టంగానే అనిపించింది.

కేవలం మూర్ఖ ప్రజలకు ఆదర్శమూర్తిగా ఉండి నైతికంగా వారిని సరైన మార్గంలో పెట్టటం తన భాద్యతగా భావించి చిన్న వయసులో అతిలోక సుందరి అయిన భార్యను ఒదిలి ఒంటరి జీవితాన్ని గడిపిన రామయ్య త్యాగాన్ని పొగడటానికి ఒక్క పాత్రాలేదు. అమ్మని ఒదిలి వేస్తే తనకు పుట్టపోయే  పిల్లలు ఏమైపోతారో వాళ్ళు మళ్ళీ తన దగ్గరకు రాక పోవచ్చని కూడా ఆయన ఆలోచించలేదు.  రాములవారి త్యాగ ఫలితంగా రామరాజ్యం లోని ప్రజల మనసుల్లో ఎలాంటి మార్పు వచ్చిందీ, ఒక జీవితానికి ఒకే భార్య అనే సిద్దాంతం ఎలా ప్రజల్లో చొచ్చుకు పోయిందీ బాపుగారు చూపుస్తారని ఆశించాను. అదిలేక పోగా సీతమ్మ వీడిన రాజ్యం కష్టాల్లో ఉన్నట్లు చూపించటం ఆశ్చర్య పరచింది. మరి ఇలా ఏ రామాయణంలో ఉన్నదో నాకు తెలియదు.

సీతమ్మ ఒంటరి జీవితం హృదయాన్ని ద్రవించేదే కానీ రామయ్య మాత్రం ఏం సుఖ పడ్డాడు?  బాపుగారు మరికొంత సున్నితంగా ఈ కధను ఆవిష్కరిస్తారని ఆశించాను.



2 comments:

  1. కదా! నాకు అలాగే అనిపించింది...

    ReplyDelete
  2. మీ బాధ అర్ధం అయింది.

    శ్రీరామచంద్రులవారు పదునొకండు వేల సంవత్సరాలు రాజ్యం చేసారు.
    వారికి 28సంవత్సరాల ప్రాయంగా ఉన్నపుడు కైకమ్మ పుణ్యమా అని పదునాలుగేండ్ల అరణ్యవాసం చేసారు.

    వారు సీతాపరిత్యాగం చేసేటప్పటికి పదివేల సంవత్సరాలు రాజ్యం యేలటం పూర్తయింది. అందుచేత వారికప్పటికి చిన్న వయసు కాదని మనవి.

    మరొక వేయేండ్లు రాజ్యం చేసాక శ్రీరాములవారు నిజధామం చేరుకున్నారు.

    ReplyDelete