Friday, February 19, 2010

గోరంత దీపం

అవునండి బాపు రమణ ల అద్భుతం గూర్చే నేను చెప్పాలనుకొన్నది.
ఈ మూవీ నేను ఒక సారి దూరదర్శన్  లో చూసి ఛాలా ఉద్వేగానికి లోను అయ్యాను.

ఆ సినిమాలో వాణిశ్రీ క్యారెక్టర్ ఆణువణువూ ఇన్స్ప్రిరింగ్ గా ఉంటుంది.  ఆమె వ్యక్తిత్వం చాల ఉన్నతం.
సూర్య కాంతం గారి నస పడటంలో, ఇంట్లో ఆర్ధిక స్తితులు భరించటం లో, భర్త చాతగానితనం చెప్పుడు మాటలు వినటం అర్ధం చేసుకోవటం లో, కాముకుడైన భర్త స్నేహితుడికి బుద్ది చెప్పటం లో, ఆ నాటి పరిస్తితుల్లో ఎంత చేయగలదో అంతా చేస్తుంది.  నేల విడిచి సాము చెయ్యకుండా నాజూగ్గా సమస్యలు దాటటానికి ప్రయత్నిస్తుంది.

మన ఇళ్ళల్లో బామ్మల్ని, పిన్నుల్ని, అమ్మల్ని, అత్తల్ని లోతుగా చూస్తే ఇలాంటి వాణిశ్రీలు ఎందఱో. భర్తలు అత్తలు చేసే అవమానాలు భారిస్తున్నట్లే ఉంటూ నిశ్శబ్ద విప్లవాలు చేస్తుంటారు అభిమానాన్ని కాపాడుకోవటానికి. బయట విప్లవాలు చేసి కేకలు వేసే స్త్రీలకంటే ఇలాంటి వారికి మరింత సహనం తెలివి ఉండాలి.

బాపు గారి స్త్రీలే ఒక ప్రత్యేకం.  ఆత్మాభిమానం, ప్రేమ సమ పాళ్ళలో కలిపి అందాల మెరుగులు అద్ది దిద్దుతారు ఎంతైనా చిత్ర కారుడు కదా.  అమాయకత్వం, తెలివి ఒక చోటే, జాలి కోపం ఒకచోటే .
C నారాయణ రెడ్డి గారి  గోరంతదీపం  పాట నిరాశలో దీపం వంటిదైతే , ఆరుద్ర గారి రాయినైనా కాక పోతిని అనే పాట అమ్మాయిలందరికీ (ఆ మాటకొస్తే అబ్బాయిలకూ ) తమ మనసులో మాట లా ఉంటుంది.
టైటిల్ సాంగ్ లోని ఈ మాటలు నాకు ఎప్పుడూ మననానికి వస్తుంటాయి.
" మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు "
నిజంగా కొద్ది మౌనం, కాస్తంత సహనం ఎంత పెద్ద సమస్య నైనా ఎలా తేలిక చేస్తుందో నేను ప్రత్యక్షం గా చూసాను. 

నిన్న ఒక టీవీ ప్రోగ్రాం లో ఒక చిన్నారి పాడి ఈ పాట గుర్తుకు తెచ్చింది. శైలజ ఎందఱో అమ్మాయిల్లాగే ఈ సినిమా తనకు స్పూర్తి నిచ్చిన సినిమా అని చెప్పారు.