Tuesday, September 28, 2010

గరుడ పురాణం - హిందూ ధర్మ సర్వస్వం

శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు హైదరాబాదులో గరుడపురాణం పై చెప్పిన ప్రవచనం రోజూ భక్తి టివి లో 8.30 ని లకు ప్రసారం అవుతున్నది.

నిన్న మొదటి భాగంలో ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైనవై మీతో పంచుకొందామని పించింది.

హిందూ ధర్మానికి మూల గ్రంధాలు, మూడు రకాలు, అవి శృతులు (వేదాలు), స్మృతులు (ధర్మ గ్రంధాలు), పురాణాలు.

మొదలెక్కడో తెలియని హిందూ ధర్మ సూత్రాలను ద్వాపర యుగాంతంలో వేద వ్యాసుడు సూత్రీకరించారు. వేదాలను విభజించి చతుర్వేదాలుగా సూత్రీకరించినట్లే అష్టాదశ పురాణాలను పొందు పరిచారు.  పురాణాలు వేదాలకు భిన్నమైన విషయాలను కాక వేదాల్లో ప్రతిపాదించిన విషయాన్నే జనబాహుళ్యానికి అందే విధంగా చెబుతాయి.  అంటే పురాణాలు సామాన్యులకు అందే భాషలో, శైలిలో వేదోక్తమైన పరబ్రహ్మను వివరిస్తాయన్న మాట.  పురాణాలు వేదవ్యాసులు రచించినవైతే అవి వేదకాలం తర్వాతవి అనటం అవివేకమని శర్మగారు చెప్పారు. 

పురాణం లక్షణమేమిటంటే, అవి (౧) సృష్టి గూర్చి,  (౨)విలయం తర్వాత మళ్ళీ సృష్టించ బడటం గూర్చి, (౩)దేవతల, ఋషుల వంశాల గూర్చి,(౪) మన్వంతరాల గూర్చి, (౫) ఆ యా మనువుల్లో పాలించిన రాజులగూర్చి చెప్తాయి.  అన్నిపురాణాల్లో ఈ విషయాలున్నా కొన్నిటిలో కొన్ని విషయాల పై తక్కువ వివరణ మరికొన్నిటి పై ఎక్కువ వివరణ ఉంటాయి.

గరుడ పురాణం మిగిలిన అన్ని పురాణాల వలే చదువ తగినది, ఇంటిలో ఉంచుకో దగినది. దీన్ని అధ్యయనం చేసిన ఒక పాశ్చాత్య శాస్త్ర వేత్త దీనిని ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అన్నారు.

(మరిన్ని రేపు)