Wednesday, July 14, 2010

మన రాష్ట్రం లోని ప్రసిద్ధ ఆలయాలు -1

 చెన్నకేశవ స్వామి గుళ్ళు పల్నాడు ప్రాంతంలో ఐదు ఉన్నాయంటారు.
ఇది మాచర్ల చెన్నకేశవ స్వామి గుడి, తేరు., ఇక్కడ స్వామి మీసాలతో, ఖడ్గంతో, శంఖ చక్రాలతో, నగుమోముతో ఉంటాడు.





క్రిందిది మార్కాపురం చెన్నకేశవ స్వావి గుడి, అక్కడి అందమైన ఆంజనీయుడు. ఇక్కడ కూడా స్వామి చక్రధారియై దుష్టశిక్షణ కు సిద్ధంగా ఉంటాడు. మాచర్ల లోని తేరు లాంటిదే ఇక్కడా ఉంటుంది.  ఈ రెండు గుళ్ళల్లోనూ చైత్ర పౌర్ణమికి రధోత్సవం జరుగుతుంది.


మిగిలినవి ఎక్కడునాయో నాకు తెలియదు. 

సరస్వతీ దేవి గుళ్ళు: -  వర్గల్ లో ..


బాసర లో ..
పంచారామాలో ఒకటి దక్షిణ కాశి గా పేరు పొందిన ద్రాక్షారామం.,సప్త మాత్రుకల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటైన మాణిక్యాంబ వెలసి ఉన్నది. అమ్మవారు నల్ల రాతి తో చెయ్యబడి చూపుతిప్పుకోనియ్యనంత ఆకర్షణీయంగా, ఒకింత ఉగ్రంగా  ఉంటుంది.



 పంచారామాల్లో మరొకటి,  సామర్లకోటలోని కుమారారామం




పై రెండు గుళ్ళ నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. లోపల ఊగుతూ ఉండే రాతి ఉయ్యాల మండపం తో సహా! శివుడు పెద్ద లింగా కారంలో రెండు అంతస్తులలో ఉంటాడు. ఈ గుళ్ళు తూర్పు చాళుక్యులు  800 AD లో కట్టించారని అన్నారు.

Wednesday, July 7, 2010

జోల పాటలు

నా జీవితం లో అత్యంత మధురమైన రోజుల్లొ కొన్ని మా పిల్లల పసితనపు రోజులు.  అమాయకమైన వాళ్ళ నవ్వులు, నిద్రపుచ్చటాలు, బుజ్జి బొజ్జలు నింపటాలు మర్చిపోలేని అనుభూతులు.  ఆడపుట్టుక పుట్టినందుకు గర్వపడే రోజులు.

అప్పుడు నేను పాడే జోలపాటలు కొన్ని గుర్తుకు వచ్చాయి. కొత్త తల్లులకు ఉపయోగిస్తాయని ఇక్కడ వ్రాస్తున్నాను.
ఇవన్ని ఒక్కక్క లైన్ పాటలే అన్ని కలి పి  పాడవచ్చు లేక ఒకటే రిపీట్ చెయ్యవచ్చు.

౧. జోల పాడు కృష్ణ జో కొట్టు రంగా ...నిదురపో బలభద్ర రాము తమ్ముడివి. .
౨. జోలల్లు పాడి తే బాలలకు నిద్రా .. నాద స్వరం ఊదితే నాగులకు ఆట
౩. జో లాలి పండెరుపు దొండ పండెరుపు అమ్మాయి/అబ్బాయి తానెరుపు తన వారి లోనన
౪. హాయి బోయి ఆపదలు కాయి, చిన్న వాడిని/దానిని కాయి శ్రీరంగ సాయి.
౫. చిచ్చి చిచ్చి రావే శ్రీ లక్ష్మి రావే .. ఆది లక్ష్మీ రావే అమ్మి తో/ అబ్బి తో నాడడ
౫. జోల పాడే వారు జో కొ ట్టు వారు.. ఆలకించే వారు అమ్మి/అబ్బి మామల్లు.
౬. అందరి మామలు చంద మామలు .. అబ్బాయి/అమ్మాయి మామలు రామ లక్ష్మణులు.
౭. చిచ్చికి పెట్టరే చీమలెంగిళ్ళు.. అమ్మికి/అబ్బికి పెట్టరే మామలెంగిళ్ళు.
౮. హాయమ్మ నెవరే ఆయన్న వారు అమ్మాయినెవరే పండన్న వారరు
౧౦, హాయి వారమ్మాయి ఆటలకు పోతే ఎవ్వారు కట్టిరే కాళ్ళ గజ్జెల్లు.
అప్పుడే మర్చిపోయానే.. ఇంకా గుర్తుకు వస్తే రాస్తాను. మీకు తెలిసినవి రాస్తారు కదా...

అలాగే ఉగ్గు పెట్టినప్పుడు ,పొట్ట సవిరిస్తూ, కాళ్ళు చేతులు మసాజ్ చేస్తూ ఇలా చెప్పచ్చు.
కుందల్లె కూర్చొని, పందల్లె పారాడి గుర్రమల్లె పరిగెత్తి.. పెద్ద అబ్బాయి/అమ్మాయి వవ్వాలి.

ఏమన్నా తినిపిచ్చాక,
జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం,  కాముడు తిన్న కజ్జికాయలు జీర్ణం
భీముడు తిన్న పిండి వంటలు జీర్ణం .. ..అమ్మాయి/అబ్బాయి తిన్న పాలన్నం జీర్ణం.

స్నానం చేయించాక శ్రీరామ రక్ష పెట్టటం తెలుసుకదా.. శ్రీరామ రక్ష , నూరేళ్ళ ఆయిస్సు, వెయ్యేళ్ళ ముత్తైదుతనం....

కర్టెసి: మా అమ్మమ్మ, అమ్మ....