Friday, February 3, 2012

శ్రీ రామ రాజ్యమా సీతా వనవాసమా?

బాపుగారికి గల రామభక్తి గురించి వినటం వల్ల చాలా ఆశలతో ఈ సినిమాకు వెళ్ళిన నాకు కొంచెం నిరాశే కలిగిందని చెప్పాలి. బాపుగారు మొదట నుండి స్త్రీ పక్షపాతే ననుకోండి ముత్యాలముగ్గు లో కానీ మిస్టర్ పెళ్ళాంలో కానీ సున్నితంగా మగవారిని విమర్శిచారు. బాపుగారి స్త్రీ పాత్రలు అభిమానవతులు, తెలివైన వారు, కష్టజీవులు ఎలాగైనా మగపాత్రలకంటే ఒక పిసరు ఎక్కువ గానే ఉంటాయి వాళ్ళ కారెక్టర్లు. కానీ ఇదే పంధా సీతా రాముల కధలో చూపించటమే నాకు కొంచెం నచ్చలేదు.

అది స్రిప్ట్ లో లోపమో నటనలో లోపమో రాములువారి గొప్పదనం మన మనసుకు అంటదు. మాటలు కూడా చాలా అసంతృప్తి కలిగించేట్లు ఉన్నాయి. ముఖ్యంగా సీతమ్మను వదిలివెయ్యాలని నిర్ణయించుకోవటంలో అనవసరంగా తమ్ముళ్ళని తూలనడటం, రాముణ్ణి శాంత గంభీర మూర్తి గా విన్న మనకు మ్రింగుడు పడదు. అలాగే రాములు వారు చేసింది తప్పన్నట్లు ప్రతివాళ్ళు మాట్లాడటం, భూదేవి తన కుమార్తె గురించి బాధపడినట్లు మాత్రమే లవకుశలో చూపిస్తే ఇక్కడ ఆవేశ పడి పోవటం, శాపాలు పెట్టటం కొంచెం చూడటానికి కష్టంగానే అనిపించింది.

కేవలం మూర్ఖ ప్రజలకు ఆదర్శమూర్తిగా ఉండి నైతికంగా వారిని సరైన మార్గంలో పెట్టటం తన భాద్యతగా భావించి చిన్న వయసులో అతిలోక సుందరి అయిన భార్యను ఒదిలి ఒంటరి జీవితాన్ని గడిపిన రామయ్య త్యాగాన్ని పొగడటానికి ఒక్క పాత్రాలేదు. అమ్మని ఒదిలి వేస్తే తనకు పుట్టపోయే  పిల్లలు ఏమైపోతారో వాళ్ళు మళ్ళీ తన దగ్గరకు రాక పోవచ్చని కూడా ఆయన ఆలోచించలేదు.  రాములవారి త్యాగ ఫలితంగా రామరాజ్యం లోని ప్రజల మనసుల్లో ఎలాంటి మార్పు వచ్చిందీ, ఒక జీవితానికి ఒకే భార్య అనే సిద్దాంతం ఎలా ప్రజల్లో చొచ్చుకు పోయిందీ బాపుగారు చూపుస్తారని ఆశించాను. అదిలేక పోగా సీతమ్మ వీడిన రాజ్యం కష్టాల్లో ఉన్నట్లు చూపించటం ఆశ్చర్య పరచింది. మరి ఇలా ఏ రామాయణంలో ఉన్నదో నాకు తెలియదు.

సీతమ్మ ఒంటరి జీవితం హృదయాన్ని ద్రవించేదే కానీ రామయ్య మాత్రం ఏం సుఖ పడ్డాడు?  బాపుగారు మరికొంత సున్నితంగా ఈ కధను ఆవిష్కరిస్తారని ఆశించాను.



Wednesday, October 12, 2011

ఆరోగ్యమే మహా భాగ్యం

మీరు పరిగెత్తి ఎన్నాళ్ళయింది?
తాడాట ఆడగలనని అనుకొంటున్నారా?
ముఖ్యంగా మీ వయసు ముప్పైపైన అయినట్లయితే  మీరు క్రీడాకారులు కానట్లయితే, ఈ ప్రశ్నలు అడిగినందుకు నన్ను చిత్రంగా చూస్తారు.

నేనూ నాలుగు నెలల క్రితంవరకూ అలాగే అనుకొనేదాన్ని. దినాజ్ ఫిట్నెస్ సెంటర్ లో నేను గడిపిన ఈ మూడు నెలలూ నా ఆలోచనా విధానాన్ని, నా జీవన శైలిని ఇంతగా మారుస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా శరీరాన్ని నిర్లక్షం చేసానని, కనీసం నా చీరలపై పెట్టిన సమయాన్ని కూడా ఆరోగ్యం కోసం కేటాయించటం లేదని నాకు ఇన్నాళ్ళకు కానీ తెలియలేదు.   అదేంటండీ, నిద్రలేస్తే మనం గడిపే సమయమంతా ఈ దేహంకోసమే కదా అని మీరు అనవచ్చు. మనం కట్టే బట్టలు, చేసే మేకప్పు,  తినే తిండి అంతా మన మనసు కోసమో  అహం (గొప్ప) కోసమో కానీ నిజానికి మన శరీరాన్ని చక్కగా ఉంచుకోవటానికి కాదు.  ఆరోగ్యం లేనప్పుడు అందం ఎక్కడిది? అలంకారం తో అందం రాదు కదా, చక్కటి ఆరోగ్యవంతమైన శరీరం లో సహజం గా ఉండే మెరుపే అందం. అందమైన మనస్సుతో నవ్విన చిరునవ్వే అందం.

నేను ఎక్కడో చదివాను, ఆడవారికి పదిహేనేళ్ళ లోపు ఆడిన ఆటలే బలమని.  అంటే తర్వాత రకరకాల సాంఘిక పరిస్థితుల వల్ల మనం ఇంటికే పరిమితమయ్యి ఆట, వ్యాయామం లేకుండా ఉండి పోతాం కనుక అలా చెప్పి ఉండవచ్చు. కానీ ఇప్పటి పరిస్థితులు మారాయి కదా, మగవారితో పాటు అన్నిపనులూ చేస్తున్నప్పుడు, ఎంతో అవసరమైన ఆటలు, వ్యాయాయం చెయ్యకపోవటం ఎంత తప్పు?

జిమ్ అంటే క్రీడాకారులుకి, సినిమా వారికి, కండలు పెంచుకోవాలనుకుండే యువకులకు మాత్రమే కాదు, ఆరోగ్యం గా ఉండాలనుకొండే అందరికోసం. ముఖ్యంగా ఆరోగ్యంగా లేనివారికోసమే జిమ్ ఉండాలేమో. చాలా తక్కువ ఫిట్నెస్ సెంటర్లు, ఫిజికల్ ట్రైనర్స్ ఈ విషయాన్ని అర్ధం చేసుకోని అన్ని స్థాయిల వారికీ అనువైన ఫిట్నెస్ ప్రోగ్రాంస్ తయారు చేస్తాయి. దినాజ్ అలాంటి వాటిల్లో ఒకటి. నాకు ముఖ్యంగా అక్కడ నచ్చింది వారి ఆటిట్యూడ్. కొంత మంది ట్రైనర్స్ స్వయంగా వారి జీవితాల్లో ఒబెసిటీని, అనారోగ్యాన్ని చూసినివారు, మిగిలినవారు కూడా ఇతరుల ఇబ్బందుల్ని అర్దం చేసుకొని పాజిటివ్ గా ప్రోత్సహించగల వాళ్ళు.  ఇక్కడ ధైరాయిడ్ మొదలైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు కూడా చక్కగా పరిగెత్తుతూ ఉండటం చూస్తే ముచ్చటగా ఉంటుంది.

ఈ మూడు నెలలూ నా జీవితం లో ఎంతో విలువైన రోజులు. అమ్మ ఇచ్చిన బలాన్ని నా జీవనశైలి వల్ల, కాన్పుల వల్ల పోగొట్టుకొన్నానే అనుకొన్న నాకు మళ్ళీ నా చిన్నతనపు బలం పొందగలనన్న నమ్మకం వచ్చింది. నా పన్నెండేళ్ళ కూతురుతో పాటు తాడాట ఆడగలుగుతుంటే సంతోషంగా ఉంది. మళ్ళీ కాలేజీలోలా షటిల్ బాడ్మెంటన్ పరిగెత్తుతూ ఆడుతుంటే ఆ ఆనందమే వేరు.

బరువు తగ్గటం ముఖ్యం కాదు, తిండి మానేసి, వృద్దాప్యాన్ని ముందే ఆహ్వానించి సన్నగా కనిపించి, చేసే పనులు కూడా చెయ్యలేక పోవటం  నాకు ఎప్పుడూ ఇష్టంలేదు.  సరైన బరువులో కి వచ్చి ఎక్కువ ఆరోగ్యం పొందటం యోగా వల్ల, వ్యాయాయం వల్ల మాత్రమే కుదురుతుంది. విదేశాల్లో ఉన్న ఏభై ఏళ్ళ మా ఆఫీస్ కొలీగ్స్ ని చూసి ఈర్ష పడి, మళ్ళీ,  వాళ్ళ ఒంటితీరులే, అక్కడి వాతావరణంలే అని సరిపెట్టుకొనే దాన్ని. ఇప్పుడు నా యాభైలో వాళ్ళలా ఉండటం సాధ్యమేనని అనిపిస్తున్నది.

నేను తెలుసుకొన్న చిన్న విషయాలు మీ కోసం,
ఎక్సర్ సైజ్ ల్లో రకాలు ఉన్నాయి. కొన్ని ప్లెక్సిబిలిటీ కోసం పనికి వస్తాయి. ముఖ్యంగా యోగా, సల్సా లాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఆరోగ్యవంతులకు ఆరోగ్యాన్ని కాపాడుకోవటాని ఇవి చాలు.
మారధాన్ లాంటి వాటిల్లో, నాలుగు వందల మీటర్లు పైన పరిగెత్తటానికి, అంటే ఒకపనిని చాలా సేపు కొంచెం తక్కువ ఇంటెన్సిటీ తో చెయ్యటానికి ఏరోబిక్స్ ఉపయోగిస్తాయి.  జనరల్ ఫిట్నెస్ పెంచుకోవటానికి తక్కువ స్థాయి ఏరోబిక్స్ చాలా ఉపయోగిస్తాయి.
బాడీ బిల్డింగ్ కి, అంటే లేని చోట మజిల్స్ పెరగటానికి, మజిల్స్ గట్టిపడి తద్వారా వాటి చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికీ, వైట్ లిఫ్టిగ్ వంటి ఆటలు ఆడేవారికి, బరువులతో చేయించే వ్యాయామాలు అవసరం. దీన్ని డంబెల్స్ , మిషన్స్ లాంటి సాధనాలు ఉపయోగించి కానీ, మన శరీర బరువునే ఒక ప్రదేశం పై పడేట్టుగా చేసి కానీ చేస్తారు.  బాడీ టోనింగ్ కి, షేప్ రావటానికి ఇవి చాలా ఉపయోగ పడతాయి.
ఇక కార్డియాక్ అంటే గుండె కండరాలకోసం పరిగెత్తటం, సైక్లింగ్ లాంటివి ఉపయోగపడతాయి. వీటికి త్రెడ్మిల్స్ ఉపయోగించవచ్చు లేదా అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చల్లగాలిలో ఆరుబయట పరిగెత్తవచ్చు.

ఇలాంటివన్నీ చక్కగా అన్ని వయస్సులవారూ  చెయ్యవచ్చు. కాకపోతే కొద్దిగా మొదలు పెట్టి చిన్నగా పెంచుకొంటూ వెళ్ళాలి.

Wednesday, March 9, 2011

అమ్మదొంగా...

మహిళా దినోత్సవం నాడు నాకు నా బుజ్జి తల్లి చూపించిన చిట్టి చిట్టి ఆప్యాయత, చాలా రోజుల తర్వాత ఒక పోస్ట్ తీరిక చేసుకొని అయినా రాయాలని గట్టిగా అనిపించేలా చేసింది.
నేనూ ఎంతో మంది అమ్మాయిల్లాగే ఎందుకో తెలియదు కానీ మొదటి సారి కడుపుతో ఉన్నప్పుడు అబ్బాయి కావాలనే కోరుకొన్నాను.  అమ్మాయి పుట్టిందని నిరాశ పడలేదు కానీ తర్వాత అయినా అబ్బాయి అయితే బాగుండని అనుకొన్న మాట నిజం. మా అమ్మ నా పక్కనే కూర్చొని నాకు మెళకువ రాగానే అమ్మాయే, భలే చక్కగా ఉన్నది అని చెప్పటం నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నది. రెండో సగం నేను అబ్బాయి కాదని నిరాశ పడకూడదని ప్రత్యేకంగా చెప్పిందని నాకు అర్దం అయింది. (నిజంగానే మా అమ్మాయి పండే అనుకోండి :))

కానీ 'దేవుడా నా క్షుద్రమైన కోరికలన్నీ కాదని నన్ను ఉద్దరించు' అని టాగూర్ కోరినట్లు, నా కోరిక కాదని అంత కంటే గొప్ప వరమైన ఆడపిల్లను నాకు ఇవ్వటం దేవుడు నాపై చూపిన కరుణ అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.  నా ముఖ కవళికలు తనకు ఎలా తెలుస్తాయో!, పట్టు మని పదేళ్ళైనా లేకుండానే అమ్మ లా అన్నీ అర్ధం చేసుకొంటుంది.  కాలేజి తర్వాత ఫ్రండ్సే లేరే అనుకొంటుండే దాన్ని. ఇప్పుడు ఎన్నో విషయాలు ఆరిందలా వింటూ, ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడు వస్తూ, పని చేసుకొంటుంటే పక్కనే ఉండి సుత్తి చెప్తూ నాకు మంచి స్నేహితురాలు నాకూతురు.  నేను ఎంతో ఇష్టంగా నేర్చుకొన్న ముగ్గులు, వంటలు, కుట్లు, పాటలు పద్యాలు నేర్చుకొనే నా ప్రియ శిష్యురాలు మా తల్లి.   ఇక పండగలొచ్చినా, ఫంక్షన్లు వచ్చినా తనచుట్టూనే మొత్తం కధ అంతా..

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ... కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ... ఈ పాటలో ప్రతి మాట ఎంత నిజం. అమ్మాయి కలిగి ఉండటం పెద్ద అదృష్టం.

ఎలా అయినా అమ్మాయిల్లేని తల్లులకు అమ్మాయిలున్న తల్లులకు తేడా ఉంటుందే అని మా పిన్ని అంటే ఏమో అనుకొన్నాను, నిజంగానే అమ్మాయి పెంపకంలో బాధ్యత, తనను ఒకరింటికి పంపటంతో ఎన్నో ఇష్టంగా భరించే కష్టాలు ఇవి అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి కొంత సున్నితత్వం, అర్ధం చేసుకొనే తత్వం వస్తాయేమో!


నా చిన్ని కిట్టుడు అల్లరి చెయ్యటానికే గానీ పెద్ద అవుతున్న కొద్దీ అమ్మకు దూరం అవుతున్నాడు. కారు బొమ్మలతో, బంతులతో ఆడటం మీది ఆసక్తి అమ్మ పక్కన కుదురుగా కూర్చోటంలో ఉండదు. ఆ అసలు కృష్ణుడు కూడా అంతేగా యశోదమ్మకు ముద్దు మురిపాలు మహా అయితే ఎనిమిదో ఏట దాకేగా.. తర్వాత గోపికలూ, రాధమ్మా, రాచరికాలు, రాయబారాలు..
అబ్బాయూ కావాలి, మన అమ్మాయి మరో ఇంటికి వెళ్ళి నప్పుడు మనకు తోడు ఉండటాని మరో అమ్మాయి ని తేవటానికైనా కావాలి. :)



Tuesday, September 28, 2010

గరుడ పురాణం - హిందూ ధర్మ సర్వస్వం

శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు హైదరాబాదులో గరుడపురాణం పై చెప్పిన ప్రవచనం రోజూ భక్తి టివి లో 8.30 ని లకు ప్రసారం అవుతున్నది.

నిన్న మొదటి భాగంలో ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైనవై మీతో పంచుకొందామని పించింది.

హిందూ ధర్మానికి మూల గ్రంధాలు, మూడు రకాలు, అవి శృతులు (వేదాలు), స్మృతులు (ధర్మ గ్రంధాలు), పురాణాలు.

మొదలెక్కడో తెలియని హిందూ ధర్మ సూత్రాలను ద్వాపర యుగాంతంలో వేద వ్యాసుడు సూత్రీకరించారు. వేదాలను విభజించి చతుర్వేదాలుగా సూత్రీకరించినట్లే అష్టాదశ పురాణాలను పొందు పరిచారు.  పురాణాలు వేదాలకు భిన్నమైన విషయాలను కాక వేదాల్లో ప్రతిపాదించిన విషయాన్నే జనబాహుళ్యానికి అందే విధంగా చెబుతాయి.  అంటే పురాణాలు సామాన్యులకు అందే భాషలో, శైలిలో వేదోక్తమైన పరబ్రహ్మను వివరిస్తాయన్న మాట.  పురాణాలు వేదవ్యాసులు రచించినవైతే అవి వేదకాలం తర్వాతవి అనటం అవివేకమని శర్మగారు చెప్పారు. 

పురాణం లక్షణమేమిటంటే, అవి (౧) సృష్టి గూర్చి,  (౨)విలయం తర్వాత మళ్ళీ సృష్టించ బడటం గూర్చి, (౩)దేవతల, ఋషుల వంశాల గూర్చి,(౪) మన్వంతరాల గూర్చి, (౫) ఆ యా మనువుల్లో పాలించిన రాజులగూర్చి చెప్తాయి.  అన్నిపురాణాల్లో ఈ విషయాలున్నా కొన్నిటిలో కొన్ని విషయాల పై తక్కువ వివరణ మరికొన్నిటి పై ఎక్కువ వివరణ ఉంటాయి.

గరుడ పురాణం మిగిలిన అన్ని పురాణాల వలే చదువ తగినది, ఇంటిలో ఉంచుకో దగినది. దీన్ని అధ్యయనం చేసిన ఒక పాశ్చాత్య శాస్త్ర వేత్త దీనిని ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అన్నారు.

(మరిన్ని రేపు)

Wednesday, July 14, 2010

మన రాష్ట్రం లోని ప్రసిద్ధ ఆలయాలు -1

 చెన్నకేశవ స్వామి గుళ్ళు పల్నాడు ప్రాంతంలో ఐదు ఉన్నాయంటారు.
ఇది మాచర్ల చెన్నకేశవ స్వామి గుడి, తేరు., ఇక్కడ స్వామి మీసాలతో, ఖడ్గంతో, శంఖ చక్రాలతో, నగుమోముతో ఉంటాడు.





క్రిందిది మార్కాపురం చెన్నకేశవ స్వావి గుడి, అక్కడి అందమైన ఆంజనీయుడు. ఇక్కడ కూడా స్వామి చక్రధారియై దుష్టశిక్షణ కు సిద్ధంగా ఉంటాడు. మాచర్ల లోని తేరు లాంటిదే ఇక్కడా ఉంటుంది.  ఈ రెండు గుళ్ళల్లోనూ చైత్ర పౌర్ణమికి రధోత్సవం జరుగుతుంది.


మిగిలినవి ఎక్కడునాయో నాకు తెలియదు. 

సరస్వతీ దేవి గుళ్ళు: -  వర్గల్ లో ..


బాసర లో ..
పంచారామాలో ఒకటి దక్షిణ కాశి గా పేరు పొందిన ద్రాక్షారామం.,సప్త మాత్రుకల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటైన మాణిక్యాంబ వెలసి ఉన్నది. అమ్మవారు నల్ల రాతి తో చెయ్యబడి చూపుతిప్పుకోనియ్యనంత ఆకర్షణీయంగా, ఒకింత ఉగ్రంగా  ఉంటుంది.



 పంచారామాల్లో మరొకటి,  సామర్లకోటలోని కుమారారామం




పై రెండు గుళ్ళ నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. లోపల ఊగుతూ ఉండే రాతి ఉయ్యాల మండపం తో సహా! శివుడు పెద్ద లింగా కారంలో రెండు అంతస్తులలో ఉంటాడు. ఈ గుళ్ళు తూర్పు చాళుక్యులు  800 AD లో కట్టించారని అన్నారు.

Wednesday, July 7, 2010

జోల పాటలు

నా జీవితం లో అత్యంత మధురమైన రోజుల్లొ కొన్ని మా పిల్లల పసితనపు రోజులు.  అమాయకమైన వాళ్ళ నవ్వులు, నిద్రపుచ్చటాలు, బుజ్జి బొజ్జలు నింపటాలు మర్చిపోలేని అనుభూతులు.  ఆడపుట్టుక పుట్టినందుకు గర్వపడే రోజులు.

అప్పుడు నేను పాడే జోలపాటలు కొన్ని గుర్తుకు వచ్చాయి. కొత్త తల్లులకు ఉపయోగిస్తాయని ఇక్కడ వ్రాస్తున్నాను.
ఇవన్ని ఒక్కక్క లైన్ పాటలే అన్ని కలి పి  పాడవచ్చు లేక ఒకటే రిపీట్ చెయ్యవచ్చు.

౧. జోల పాడు కృష్ణ జో కొట్టు రంగా ...నిదురపో బలభద్ర రాము తమ్ముడివి. .
౨. జోలల్లు పాడి తే బాలలకు నిద్రా .. నాద స్వరం ఊదితే నాగులకు ఆట
౩. జో లాలి పండెరుపు దొండ పండెరుపు అమ్మాయి/అబ్బాయి తానెరుపు తన వారి లోనన
౪. హాయి బోయి ఆపదలు కాయి, చిన్న వాడిని/దానిని కాయి శ్రీరంగ సాయి.
౫. చిచ్చి చిచ్చి రావే శ్రీ లక్ష్మి రావే .. ఆది లక్ష్మీ రావే అమ్మి తో/ అబ్బి తో నాడడ
౫. జోల పాడే వారు జో కొ ట్టు వారు.. ఆలకించే వారు అమ్మి/అబ్బి మామల్లు.
౬. అందరి మామలు చంద మామలు .. అబ్బాయి/అమ్మాయి మామలు రామ లక్ష్మణులు.
౭. చిచ్చికి పెట్టరే చీమలెంగిళ్ళు.. అమ్మికి/అబ్బికి పెట్టరే మామలెంగిళ్ళు.
౮. హాయమ్మ నెవరే ఆయన్న వారు అమ్మాయినెవరే పండన్న వారరు
౧౦, హాయి వారమ్మాయి ఆటలకు పోతే ఎవ్వారు కట్టిరే కాళ్ళ గజ్జెల్లు.
అప్పుడే మర్చిపోయానే.. ఇంకా గుర్తుకు వస్తే రాస్తాను. మీకు తెలిసినవి రాస్తారు కదా...

అలాగే ఉగ్గు పెట్టినప్పుడు ,పొట్ట సవిరిస్తూ, కాళ్ళు చేతులు మసాజ్ చేస్తూ ఇలా చెప్పచ్చు.
కుందల్లె కూర్చొని, పందల్లె పారాడి గుర్రమల్లె పరిగెత్తి.. పెద్ద అబ్బాయి/అమ్మాయి వవ్వాలి.

ఏమన్నా తినిపిచ్చాక,
జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం,  కాముడు తిన్న కజ్జికాయలు జీర్ణం
భీముడు తిన్న పిండి వంటలు జీర్ణం .. ..అమ్మాయి/అబ్బాయి తిన్న పాలన్నం జీర్ణం.

స్నానం చేయించాక శ్రీరామ రక్ష పెట్టటం తెలుసుకదా.. శ్రీరామ రక్ష , నూరేళ్ళ ఆయిస్సు, వెయ్యేళ్ళ ముత్తైదుతనం....

కర్టెసి: మా అమ్మమ్మ, అమ్మ....

Wednesday, June 16, 2010

ఆ కులాల మోడల్స్ ఆమోద యోగ్యమే!!

నేను కుల వ్యవస్థను గూర్చి చర్చించ గలిగినంత చరిత్ర చదివిన దాన్ని కాదు.

కాని సమకాలీన పరిస్థితులను, మా తాత గారి నాన్న గారి తరం వరకు వాళ్ళు చెప్పిన నేను గమనించిన విషయాల అవగాహనతో ఈ విషయం పై అనిపించిన విషయాలు చెప్పాలనుకొంటున్నాను.

శారద గారు ఎప్పుడో 'ఈ మాట'లో రాసిన కధ  లొ చెప్పినట్లు, కుటుంబం పరిధి దాటి, కులాలను, ప్రాంతాలను,  వృత్తులను, మతాలను, దేశాన్ని, జాతులను, భాషను ప్రాతిపదికగా మనం కొన్ని ర్రూపులు గా ఏర్పడతాము. ఇంత కంటే విశాలమైన విశ్వైక మతం అభిలషనీయమైనా అది ఇప్పట్లో అసాద్యం. ఈ గ్రూపుల వల్ల లాభాలు కొన్ని నష్టాలు అనేకం. గ్రూపు మంచి గురించి మాత్రమే ఆలోచిస్తే లాభం, మంచి గురించి ఆలోచిస్తున్నాం అనుకొంటూ పక్క గ్రూపు నాశనం గూర్చి మాత్రమే ఆలోచిస్తే నష్టం.

కనుక ఏ గ్రూపు విజయం లోనించైనా మనం మంచి మాత్రమే గ్రహించి ఆచరిస్తే ఇతర గ్రూపులకు కూడా ఆ సక్స్ స్ అందుతుంది. బ్రిటీషు వారు వదలి వెళ్ళేనాటికి వ్యవసాయ దారులు, జమీందారులు అయిన ఒక కులం వాళ్ళు ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు, ప్రొఫెషనల్స్, రాజకీయ నాయకులు, ఎక్కువ సంఖ్య లో ఉన్న యెన్నారైలు అయ్యారంటే, దీని వెనక వాళ్ళ కృషి ఏంటి అనేది గ్రహిస్తే అది ఇతరులకు ఉపయోగిస్తుంది. వారు చదువులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళకులాల్లో చదుకొనేవారి కోసం స్కాలర్ షిప్స్, హాస్టల్స్ ఎలా ఏర్పాటు చేసారు, ఎలా మీటింగ్ ల ద్వారా వాళ్ళ గ్రూప్ లొ ఇతరులకు ఈ విషయాల పై అవగాహన కలిగించారు అన్నది తెలుసుకొని పాటిస్తే మంచిది. తరాలనుండి వాళ్ళ వద్ద ఉన్న డబ్బుని, ఆస్థులను ఎలా తెలివిగా కొత్త ఇన్వెష్ట్ మెంట్స్ చేసారు, ఎలా శ్రమతో వాటిని పెంచారు అన్నది తెలుసుకోవాలి.

అలా కాక వాళ్ళు ఒక కులం పై వ్యతిరేకించి నిందించటం వల్ల గెలిచారు అనే చెత్త కంక్లూజన్స్ తీసుకొంటే మంచి చెయ్యక పోగా చెడు చేస్తుంది. నిజానికి వాళ్ళు వీళ్ళకు ప్రత్యేకంగా చెడు చేసింది లేదు. వాళ్ళెవరూ అర్చక వృత్తి తీసుకొని వీళ్ళకు పోటీ రాలేదూ, ఊళ్ళూ, ఇళ్ళూ తగలెట్టుకోలేదు.  నిజానికి ఇష్టం ఉన్నాలేక పోయినా వీరిలో ఎంతో మంది కి వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలిచ్చి భృతి కల్పించారు. ఒక వ్యక్తి తన స్వంత కారణాల వల్ల పెంచుకొన్న ద్వేషాన్ని అందరికీ అంటగట్టక్కర లేదు.



అలాగే బ్రిటీష్ వారు వెళ్ళి పోయిన తర్వాతి సామ్యవాద రోజుల్లో, గుళ్ళు, బళ్ళు ప్రభుత్వ పరం చెయ్యటం వల్ల కుల వృత్తులైన అర్చకత్వం, అధ్యాపకం, కరణీకం నుండి దూరమై, అన్ని ఉపాధుల్లొ రిజర్వేషన్ పేరిట గెంట బడి అతి పేదరికం నుండి ఇప్పుడు కొంత నిలదొక్కు కున్న ఈ కులం వాళ్ళూ, కృషిని, చదువునే నమ్ముకొన్నారు, ద్వేషాన్ని కాదు.

కనుక నాయకులారా, ఒట్టి మాటలు కట్టి పెట్టి, తమ గ్రూపు వృద్ధి కోరుకొనే వాళ్ళయితే, తము ఉచిత అవకాశాలనుండి తప్పుకొని, తగిన వారికి అవకాశాలు ఇస్తూ, వారికి ప్రభుత్వ పధకాలపై అవగాహన పెంచుతూ వారికి చదువు చెప్పి, పైకి తీసుకు రండి. వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలను కొంటే ఇరరుల పట్ల ద్వేషం పెంచటమే మార్గం.
అదేకానివ్వండి. స్వచ్చందమైన అంటరాని తనాన్ని ద్వేషం ద్వారా కల్పించక నలుగురిలో కలిసే మార్గం చూపండి. మా నాన్న గారి కజిన్ నాన్నగారితో తన డెబ్బయ్యవ ఏట అన్నమాటలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. "ఒరే మా అమ్మ నేను ఒక్కడే కొడుకు అవ్వటం వల్ల  నన్ను చాలా గారాబం గా పెంచింది అయితే నాయన, మనకు ఎవ్వరూ మేలు చెయ్య లేదురా అంటూ చుట్టాలందరి పట్ల ద్వేషం నేర్పించింది. నేను ఇప్పుడు అందర్ని దూరం ఉంచి ధనవంతున్నయ్యాను కాని ఒంటరి వాణ్ణయ్యాను. మీకు మీఅమ్మ మంచి తనం, నలుగుర్లో కలవటం చెప్పింది. అది ఎంత పెద్ద ఆస్థో నాకు ఇప్పుడు తెలుస్తోంది అని. " అలాగా మీ పై తరాల వాళ్ళను ఒంటరి వాళ్ళను చెయ్యకండి మీ మూర్ఖత్వాలతో.  హైదరాబాదులో ఒకప్పుడు గొప్పవాళ్ళయిన ఒక మతం వాళ్ళు ఈ రోజు చదువులు లేక,  స్వార్ధపరులైన లీడర్ల వల్ల కదా రౌడీలు గా మిగిలి పొయ్యారు. లేకపోతే వీళ్ళు ఎంత చక్కటి పని మంతులు, కష్టపడ గలిగిన వాళ్ళు, వాళ్ళకు అంత పేదరికం ఏమిటి?


నాయకులే ముంచినా తేల్చినా! కనుక నాయకులు ఒక తప్పు చేస్తే అది తరాలకు కొడుతుంది. తస్మాత్ జాగ్రత్త. పెద్దవాళ్ళంటారు.,రాజులకు ఎక్కువ పాపాలు అంటుతయ్యట. తెలిసి చేసేవి తెలియక చేసేవి. డబ్బుకే అయితే ఇతర మార్గాలు చూసుకోండి పాపాలు మూటకట్టుకోకండి.