Wednesday, October 12, 2011

ఆరోగ్యమే మహా భాగ్యం

మీరు పరిగెత్తి ఎన్నాళ్ళయింది?
తాడాట ఆడగలనని అనుకొంటున్నారా?
ముఖ్యంగా మీ వయసు ముప్పైపైన అయినట్లయితే  మీరు క్రీడాకారులు కానట్లయితే, ఈ ప్రశ్నలు అడిగినందుకు నన్ను చిత్రంగా చూస్తారు.

నేనూ నాలుగు నెలల క్రితంవరకూ అలాగే అనుకొనేదాన్ని. దినాజ్ ఫిట్నెస్ సెంటర్ లో నేను గడిపిన ఈ మూడు నెలలూ నా ఆలోచనా విధానాన్ని, నా జీవన శైలిని ఇంతగా మారుస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా శరీరాన్ని నిర్లక్షం చేసానని, కనీసం నా చీరలపై పెట్టిన సమయాన్ని కూడా ఆరోగ్యం కోసం కేటాయించటం లేదని నాకు ఇన్నాళ్ళకు కానీ తెలియలేదు.   అదేంటండీ, నిద్రలేస్తే మనం గడిపే సమయమంతా ఈ దేహంకోసమే కదా అని మీరు అనవచ్చు. మనం కట్టే బట్టలు, చేసే మేకప్పు,  తినే తిండి అంతా మన మనసు కోసమో  అహం (గొప్ప) కోసమో కానీ నిజానికి మన శరీరాన్ని చక్కగా ఉంచుకోవటానికి కాదు.  ఆరోగ్యం లేనప్పుడు అందం ఎక్కడిది? అలంకారం తో అందం రాదు కదా, చక్కటి ఆరోగ్యవంతమైన శరీరం లో సహజం గా ఉండే మెరుపే అందం. అందమైన మనస్సుతో నవ్విన చిరునవ్వే అందం.

నేను ఎక్కడో చదివాను, ఆడవారికి పదిహేనేళ్ళ లోపు ఆడిన ఆటలే బలమని.  అంటే తర్వాత రకరకాల సాంఘిక పరిస్థితుల వల్ల మనం ఇంటికే పరిమితమయ్యి ఆట, వ్యాయామం లేకుండా ఉండి పోతాం కనుక అలా చెప్పి ఉండవచ్చు. కానీ ఇప్పటి పరిస్థితులు మారాయి కదా, మగవారితో పాటు అన్నిపనులూ చేస్తున్నప్పుడు, ఎంతో అవసరమైన ఆటలు, వ్యాయాయం చెయ్యకపోవటం ఎంత తప్పు?

జిమ్ అంటే క్రీడాకారులుకి, సినిమా వారికి, కండలు పెంచుకోవాలనుకుండే యువకులకు మాత్రమే కాదు, ఆరోగ్యం గా ఉండాలనుకొండే అందరికోసం. ముఖ్యంగా ఆరోగ్యంగా లేనివారికోసమే జిమ్ ఉండాలేమో. చాలా తక్కువ ఫిట్నెస్ సెంటర్లు, ఫిజికల్ ట్రైనర్స్ ఈ విషయాన్ని అర్ధం చేసుకోని అన్ని స్థాయిల వారికీ అనువైన ఫిట్నెస్ ప్రోగ్రాంస్ తయారు చేస్తాయి. దినాజ్ అలాంటి వాటిల్లో ఒకటి. నాకు ముఖ్యంగా అక్కడ నచ్చింది వారి ఆటిట్యూడ్. కొంత మంది ట్రైనర్స్ స్వయంగా వారి జీవితాల్లో ఒబెసిటీని, అనారోగ్యాన్ని చూసినివారు, మిగిలినవారు కూడా ఇతరుల ఇబ్బందుల్ని అర్దం చేసుకొని పాజిటివ్ గా ప్రోత్సహించగల వాళ్ళు.  ఇక్కడ ధైరాయిడ్ మొదలైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు కూడా చక్కగా పరిగెత్తుతూ ఉండటం చూస్తే ముచ్చటగా ఉంటుంది.

ఈ మూడు నెలలూ నా జీవితం లో ఎంతో విలువైన రోజులు. అమ్మ ఇచ్చిన బలాన్ని నా జీవనశైలి వల్ల, కాన్పుల వల్ల పోగొట్టుకొన్నానే అనుకొన్న నాకు మళ్ళీ నా చిన్నతనపు బలం పొందగలనన్న నమ్మకం వచ్చింది. నా పన్నెండేళ్ళ కూతురుతో పాటు తాడాట ఆడగలుగుతుంటే సంతోషంగా ఉంది. మళ్ళీ కాలేజీలోలా షటిల్ బాడ్మెంటన్ పరిగెత్తుతూ ఆడుతుంటే ఆ ఆనందమే వేరు.

బరువు తగ్గటం ముఖ్యం కాదు, తిండి మానేసి, వృద్దాప్యాన్ని ముందే ఆహ్వానించి సన్నగా కనిపించి, చేసే పనులు కూడా చెయ్యలేక పోవటం  నాకు ఎప్పుడూ ఇష్టంలేదు.  సరైన బరువులో కి వచ్చి ఎక్కువ ఆరోగ్యం పొందటం యోగా వల్ల, వ్యాయాయం వల్ల మాత్రమే కుదురుతుంది. విదేశాల్లో ఉన్న ఏభై ఏళ్ళ మా ఆఫీస్ కొలీగ్స్ ని చూసి ఈర్ష పడి, మళ్ళీ,  వాళ్ళ ఒంటితీరులే, అక్కడి వాతావరణంలే అని సరిపెట్టుకొనే దాన్ని. ఇప్పుడు నా యాభైలో వాళ్ళలా ఉండటం సాధ్యమేనని అనిపిస్తున్నది.

నేను తెలుసుకొన్న చిన్న విషయాలు మీ కోసం,
ఎక్సర్ సైజ్ ల్లో రకాలు ఉన్నాయి. కొన్ని ప్లెక్సిబిలిటీ కోసం పనికి వస్తాయి. ముఖ్యంగా యోగా, సల్సా లాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఆరోగ్యవంతులకు ఆరోగ్యాన్ని కాపాడుకోవటాని ఇవి చాలు.
మారధాన్ లాంటి వాటిల్లో, నాలుగు వందల మీటర్లు పైన పరిగెత్తటానికి, అంటే ఒకపనిని చాలా సేపు కొంచెం తక్కువ ఇంటెన్సిటీ తో చెయ్యటానికి ఏరోబిక్స్ ఉపయోగిస్తాయి.  జనరల్ ఫిట్నెస్ పెంచుకోవటానికి తక్కువ స్థాయి ఏరోబిక్స్ చాలా ఉపయోగిస్తాయి.
బాడీ బిల్డింగ్ కి, అంటే లేని చోట మజిల్స్ పెరగటానికి, మజిల్స్ గట్టిపడి తద్వారా వాటి చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికీ, వైట్ లిఫ్టిగ్ వంటి ఆటలు ఆడేవారికి, బరువులతో చేయించే వ్యాయామాలు అవసరం. దీన్ని డంబెల్స్ , మిషన్స్ లాంటి సాధనాలు ఉపయోగించి కానీ, మన శరీర బరువునే ఒక ప్రదేశం పై పడేట్టుగా చేసి కానీ చేస్తారు.  బాడీ టోనింగ్ కి, షేప్ రావటానికి ఇవి చాలా ఉపయోగ పడతాయి.
ఇక కార్డియాక్ అంటే గుండె కండరాలకోసం పరిగెత్తటం, సైక్లింగ్ లాంటివి ఉపయోగపడతాయి. వీటికి త్రెడ్మిల్స్ ఉపయోగించవచ్చు లేదా అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చల్లగాలిలో ఆరుబయట పరిగెత్తవచ్చు.

ఇలాంటివన్నీ చక్కగా అన్ని వయస్సులవారూ  చెయ్యవచ్చు. కాకపోతే కొద్దిగా మొదలు పెట్టి చిన్నగా పెంచుకొంటూ వెళ్ళాలి.

Wednesday, March 9, 2011

అమ్మదొంగా...

మహిళా దినోత్సవం నాడు నాకు నా బుజ్జి తల్లి చూపించిన చిట్టి చిట్టి ఆప్యాయత, చాలా రోజుల తర్వాత ఒక పోస్ట్ తీరిక చేసుకొని అయినా రాయాలని గట్టిగా అనిపించేలా చేసింది.
నేనూ ఎంతో మంది అమ్మాయిల్లాగే ఎందుకో తెలియదు కానీ మొదటి సారి కడుపుతో ఉన్నప్పుడు అబ్బాయి కావాలనే కోరుకొన్నాను.  అమ్మాయి పుట్టిందని నిరాశ పడలేదు కానీ తర్వాత అయినా అబ్బాయి అయితే బాగుండని అనుకొన్న మాట నిజం. మా అమ్మ నా పక్కనే కూర్చొని నాకు మెళకువ రాగానే అమ్మాయే, భలే చక్కగా ఉన్నది అని చెప్పటం నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నది. రెండో సగం నేను అబ్బాయి కాదని నిరాశ పడకూడదని ప్రత్యేకంగా చెప్పిందని నాకు అర్దం అయింది. (నిజంగానే మా అమ్మాయి పండే అనుకోండి :))

కానీ 'దేవుడా నా క్షుద్రమైన కోరికలన్నీ కాదని నన్ను ఉద్దరించు' అని టాగూర్ కోరినట్లు, నా కోరిక కాదని అంత కంటే గొప్ప వరమైన ఆడపిల్లను నాకు ఇవ్వటం దేవుడు నాపై చూపిన కరుణ అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.  నా ముఖ కవళికలు తనకు ఎలా తెలుస్తాయో!, పట్టు మని పదేళ్ళైనా లేకుండానే అమ్మ లా అన్నీ అర్ధం చేసుకొంటుంది.  కాలేజి తర్వాత ఫ్రండ్సే లేరే అనుకొంటుండే దాన్ని. ఇప్పుడు ఎన్నో విషయాలు ఆరిందలా వింటూ, ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడు వస్తూ, పని చేసుకొంటుంటే పక్కనే ఉండి సుత్తి చెప్తూ నాకు మంచి స్నేహితురాలు నాకూతురు.  నేను ఎంతో ఇష్టంగా నేర్చుకొన్న ముగ్గులు, వంటలు, కుట్లు, పాటలు పద్యాలు నేర్చుకొనే నా ప్రియ శిష్యురాలు మా తల్లి.   ఇక పండగలొచ్చినా, ఫంక్షన్లు వచ్చినా తనచుట్టూనే మొత్తం కధ అంతా..

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ... కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ... ఈ పాటలో ప్రతి మాట ఎంత నిజం. అమ్మాయి కలిగి ఉండటం పెద్ద అదృష్టం.

ఎలా అయినా అమ్మాయిల్లేని తల్లులకు అమ్మాయిలున్న తల్లులకు తేడా ఉంటుందే అని మా పిన్ని అంటే ఏమో అనుకొన్నాను, నిజంగానే అమ్మాయి పెంపకంలో బాధ్యత, తనను ఒకరింటికి పంపటంతో ఎన్నో ఇష్టంగా భరించే కష్టాలు ఇవి అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి కొంత సున్నితత్వం, అర్ధం చేసుకొనే తత్వం వస్తాయేమో!


నా చిన్ని కిట్టుడు అల్లరి చెయ్యటానికే గానీ పెద్ద అవుతున్న కొద్దీ అమ్మకు దూరం అవుతున్నాడు. కారు బొమ్మలతో, బంతులతో ఆడటం మీది ఆసక్తి అమ్మ పక్కన కుదురుగా కూర్చోటంలో ఉండదు. ఆ అసలు కృష్ణుడు కూడా అంతేగా యశోదమ్మకు ముద్దు మురిపాలు మహా అయితే ఎనిమిదో ఏట దాకేగా.. తర్వాత గోపికలూ, రాధమ్మా, రాచరికాలు, రాయబారాలు..
అబ్బాయూ కావాలి, మన అమ్మాయి మరో ఇంటికి వెళ్ళి నప్పుడు మనకు తోడు ఉండటాని మరో అమ్మాయి ని తేవటానికైనా కావాలి. :)